జిల్లా గురించి
కామారెడ్డి అనే పేరు 1600 నుండి 1640 సంవత్సరములలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి వచ్చింది. ఈ ప్రదేశము పూర్వము కోడూరుగా పిలువబడేది.ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామము ఉన్నది.హరిజన వాడలో కోడూరు హనుమండ్ల గుడి ఉండేది.కామారెడ్డిలో అత్యంత ప్రాచీనమైన చరిత్ర కల్గిన దేవాలయమిది. ఈ దేవలయమే కాక (03) ఇతర దేవాలయములు కూడ కామారెడ్డిలో ఉన్నట్లు ఋజువులు కలవు.
అవి: 1.కిష్టమ్మ గుడి. 2.వేణు గోపాలస్వామి గుడి. 3.విట్టలేశ్వర ఆలయం.కాకతీయ రాజవంశంలో ఈ ప్రదేశము కాకర్త్య గుండనచే పాలించబడినట్లు మాచారెడ్డి మండలము బండ రామేశ్వర పల్లి గ్రామములో గల శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయములో ఋజువులు కలవు.
కామారెడ్డి జిల్లా పునర్విభజనకు పూర్వము నిజామాబాదు జిల్లా నుండి కొత్త జిల్లాగా 11-10-2016 నుండి ఆవిర్భవించి (03) రెవెన్యూ డివిజన్లు మరియు (22) మండలములుగా మరియు కామారెడ్డి పురపాలక సంఘం (01) గా ఏర్పడినది. తదుపరి బాన్సువాడ మరియు ఏల్లారెడ్డి పట్టణములు (1) పురపాలక సంచాగా మరి ఒకటే నగర పంచాయతిగా ఏర్పడినది. రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, పెద్ద కొడప్గల్, నస్రుల్లాబాద్ కోత్త మండలములతో పాటు పాత (17) మండలములతో మొత్తం (22) మండలములతో కామారెడ్డి జిల్లా అవతరించింది.
ఈ జిల్లా దేశానికి అనేక మంది స్వాతంత్య్రా సమరయోధులు, సామాజిక కార్యకర్తలను అందించింది.ఈ జిల్లా ప్రజలు ఆయుధాలతో ఆయుధాలు కలిగి ఉన్న నిజాం ప్రభుత్వ మద్దతును ఆస్వాదించిన రజాకర్లతో ధైర్యంగా పోరాడారు, చివరకు ఈ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఈ జిల్లా నాయకులు మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన “క్విట్ ఇండియా ఉద్యమం” తో పాటు మిగిలిన తెలంగాణలో పాల్గొన్నారు.
ఉత్తరమున నిజామాబాద్, తూర్పున రాజన్న సిరిసిల్ల మరియు సిద్ధిపేట జిల్లాలు, దక్షిణాన మెదక్ జిల్లా మరియు పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మరియు కర్నాటక రాష్టంలోని బీదర్ జిల్లాలు సరిహద్దులుగా కలగియున్నది. జిల్లా భౌగోళిక విస్తీర్ణము 3652 చదరపు కిలోమీటర్లు. 18-19’ -07’’ అక్షాంశం మరియు 78-20’ -37’’ రేఖాంశముగా జిల్లా కలదు.
ప్రకృతి వనరులు
అడవులు :
జిల్లాలో 82,190.48 హెక్టార్ల అటవీ భూములు కలవు. ఇది మొత్తము భౌగోళిక విస్తీర్ణములో 22.43% అటవీ భూములలో ఉండే వెదురు, బీడి ఆకులు వలన ఆదాయం లభించుచున్నది. ఈ జిల్లాలో అడవులలో సీతా ఫలము పండ్లు ఎక్కువగా లభించును.
నేలలు:
జిల్లాలో నల్ల మట్టి 52% మరియు చల్క 47% (ఇసుక గరప) భూములు కలవు. పూర్వపు జిల్లాలో అంతర్భాగమైన మద్నూర్ మరియు బాన్సువాడలో నల్ల మట్టి నేలలు మరియు ఇతర ప్రాంతములలో చల్క భూములు కలవు.
ఖనిజములు:
జిల్లాలో చెప్పుకోదగ్గ ఖనిజములు లభించవు. కొన్ని ప్రాంతములలో లేటరైట్ ఫేర్రోజీయాస్ ఇనుప ఖనిజములు లభించినను నాసిరకమైన ఖనిజములు. జిల్లాలో భిక్నూర్ మండలములోని గుర్జకుంట మరియు తాడ్వాయి మండలములోని కరడ్ పల్లి గ్రామములలో అల్యూమినియం ఖనిజములు లభించును.జిల్లాలో తిప్పాపూర్, భిక్నూర్ మరియు కుప్రియాల్ గ్రామములలో సున్నపురాయి చతుర్బుజం ఖనిజములు కలవు మరియు రోడ్లు, భవనములు నిర్మాణములకు అనువైన గ్రానైటు ఖనిజములు కలవు.
నదులు :
కామారెడ్డి జిల్లాకు ప్రధానమైన నది మంజీర. మంజీర నది కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలోని పోటోడా తాలూకా నుండి ప్రారంభమై జిల్లాకు నైరుతి దిశగా వచ్చి ప్రవహించుచున్నది. జిల్లాలోని నిజాంసాగర్ ఆనకట్ట నిజాంసాగర్ మండలములోని అచ్చంపేట గ్రామములో నిర్మించబడినవి.
పై ప్రధానమైన నీటి వనరుయేగాక కర్నాటక రాష్ట్రం నుండి జుక్కల్ మండలంనకు వచ్చు కౌలాస్ వాగు ద్వారా కూడా జిల్లా లబ్ది పొందుచున్నది. ఈ సూక్ష్మ ప్రాజెక్టు జుక్కల్ మండలములోని లింగంపల్లి సవార్గం గ్రామములో నిర్మించబడినది. జిల్లాలోని జుక్కల్ మరియు బిచ్కుంద మండలములకు ఈ సేద్యము నీటి ద్వారా వ్యవసాయ పనులు కొనసాగుచున్నది.
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయరంగములో అభివృద్ధి చెందిన జిల్లాగా ప్రసిద్ధి పొందినది. సాంప్రదాయకమైన చేతి వృత్తుల పరిశ్రమ అయిన బీడి చుట్టుట ఈ జిల్లాలో ప్రధానమైన మహిళా ఆర్థిక వ్యాపకము. జిల్లాలో చెరుకు పంట ప్రధానమైన పంటలలో ఒకటి. ఈ కారణంగానే జిల్లాలో ఇందిర షుగర్స్ మరియు గాయత్రి షుగర్స్ పేరిట చెరకు పరిశ్రమలు నెలకొల్పబడినవి. ఈ పరిశ్రమలు జిల్లాకు ఆర్థికంగా బలపడుటకు మరియు ఆదాయము సమకూర్చుటకు ఉపకరించుచున్నవి.
చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మక వైశిష్ట్యము:
కాళ భైరవ స్వామి దేవాలయం:
ఈ దేవాలయం జిల్లాలోని రామారెడ్డి మండలములోని ఇసన్నపల్లి గ్రామములలో కలదు. దేవాలయములోని కాళభైరవ విగ్రహము 23వ తీర్థాంకర పార్శవనాధమూలాలను పోలియున్నది.
సిద్ధి రామేశ్వర స్వామి దేవాలయం:
అత్యంత ప్రాముఖ్యత గల శైవ దేవాలయముగా సిద్ధి రామేశ్వరాలయము ప్రాచుర్యము పొందినది. ఇది జిల్లాలోని భిక్నూర్ మండలములలో కలదు. ఈ దేవాలయం గురించి ఒక పురాణ కథ ప్రాచుర్యము పొందినది. దక్షిణ భారతదేశములోని అనేకమంది యాత్రికులు ఈ దేవాలయమును దర్శించి తరించుచున్నారు.
శ్రీ బసవ లింగప్ప స్వామి దేవాలయం:
శ్రీ బసవ లింగప్ప స్వామి దేవాలయం జిల్లాలోని బిచ్కుంద మండలములో కలదు.
కోటలు:
జిల్లాలో దోమంకొండ కోట రాష్ట్రకూటులచే నిర్మింపబడినది. 1786 సం.లో ఈ కోట కామినేని వంశముల క్రిందికి వచ్చి పాలింపబడినది.కౌలాస్ కోట జిల్లాలోని జుక్కల్ మండలంలో గల కౌలస్ గ్రామములో నిర్మింపబడినది.