జక్సాని నాగన్న బావి, లింగంపేట్.
మన లింగం పేట్, పాపన్న పేట్ సంస్థానాలు
లింగంపేట్ గ్రామాన్ని పాపన్నపేట సంస్థానాధీశులైన వెంకట నరసింహరెడ్డి, రాణి లింగాయమ్మ గార్లు స్థాపించినట్లుగా తెలుస్తుంది. రాణి లింగాయమ్మ పేరిట ఈ గ్రామాన్ని లింగంపేట అని పిలుస్తారు. గ్రామ క్షేమం, అభివృద్ధి, ప్రజా అవసరాల కోసం కోట గోడల నిర్మాణం చేపట్టారు. చెరువులను, బావులను తవ్వించారు. రాజా నరసింహరెడ్డి పాలనా కాలంలో పాపన్నపేట సంస్థానం ఎంతో విస్తరించి అభివృద్ధి చెందింది. వీరి పరిపాలన సమయంలోనే మన జక్సాని నాగన్న బావి నిర్మించి ఉంటారని భావించవచ్చు.
రాణి శంకరమ్మ పాపన్నపేట సంస్థానాధీశుల్లో వీరవనిత. యుద్ధ విద్య విశారద. గొప్ప సైన్యాన్ని సమీకరించుకుని నిజాం రాజ్యభాగంపై దండెత్తి వచ్చి ప్రజలను పీడించి పన్ను వసూలు చేసుకునే మహారాష్ట్ర సైన్యాన్ని ఎన్నోసార్లు ధైర్యసాహసాలతో ఎదిరించింది. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చిన నిజాం సుల్తాన్ రాణి శంకరమ్మకు రాయబాగిన్(ఆడ సింహం) బిరుదు ఇచ్చి సత్కరించాడు. ఈమె రాణి రుద్రమదేవి వంటి సమర్థురాలు. ఈమె వ్యవసాయాభివృద్ధి కోసం ఎన్నో పెద్ద చెరువులు, కాల్వలు నిర్మించింది.